అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Sunday, April 26, 2009

నానోలు (నానో కవిత్వ) వార్తలు

http://www.suryaa.com/showaksharam.asp?ContentId=15263

Friday, April 24, 2009

చంద్రుపట్ల తిరుపతి రెడ్డి గారి నానోలు


అంతా
నానోమయం
మైక్రోలు
పర్వతాలు-


పగిలిన
అద్దం
ఎన్నో
ప్రతిబింబాలు-


ముందుకు
పయనం
వెనక
పొగ-


ఎత్తైన
హోర్డింగు
దాగిన
ఆకాశం-


ఇరుకు
సందులు
దూసుకుపోయే
నానోలు-


Friday, April 17, 2009

వేదాంతం వెంకట సత్యవతి గారి నానోలు:


జన పద నానోలు

మావోడే
కిట్టమూరితి!

కట్టపడకుండా

కాసుకుంటాడు-


కాసులిస్తే
వోటేస్తా
గంజైనా
వస్తాది-


మీటింగ్లో
కూసున్నా
నిల్సున్నా
నోట్లేనటక్క-


సద్దుసేయక
యేలిముద్రేస్తేనే

సద్దికూడైనా

సారాసీసైనా
-

సమిధ ఆనంద్ గారి నుండి అందిన నానోల్లో రామాయణం:


సమిధ ఆనంద్ గారి నుండి అందిన నానోల్లో రామాయణం:

నానో రామాయణము

రఘురాముని
జనన౦

రఘువ౦శపు

సుకృత౦
-
అద్ద౦లో
చ౦దమామ
బాలరాముని
ఆటబొమ్మ-
సూర్యచ౦ద్రుల
తేజము

శివకేశవా౦శ

రామము
-
రామపాదము
శిలయైన
అహల్యకు
పునర్జన్మస్థలము-
శివచాప
భ౦గము

సీతారామ

కల్యాణము
-
కోద౦డరామ
నామముతో
శివునివిల్లు
ధన్యము-
కైక
కోరికలు

దశరధునికి

రామవియోగము-
సీతా
రామ
లక్ష్మణుల
వనవాశము-
చిత్రకూటమే
రామరాజ్యము

రామహృదయమే

సీతాధామము-
జానకి
పదమ౦జీరము
రాముని
యదస౦గీతము-
శూర్ఫణకకు
అవమానము

సిరిల౦కకు

కలవరము
-
రావణాగ్రహ
పర్యవశానము
జానకీ
అపహరణము-
సీతారామ
వియోగము

జనుల౦దరికీ

విచారము
-
అల్పాయువు
జటాయువు
సీతాన్వేషణకు
మార్గదర్శకము-
శబరి
ఎ౦గిలి

రామునికి

పరమాన్నము
-
కా౦చనహారమే
చిహ్నము
రామా౦జనేయ
స౦గమము-
రామనామమే
ధ్యానము

ఆ౦జనేయుని

ప్రాణము
-
రామముద్రిక
సీతచేతికి
చ౦ద్రహారము
రామదోసిలికి-
చూసిరమ్మన్న
రాముడు

కాల్చివచ్చిన

ఆ౦జనేయుడు
-
దారిచూపిన
హనుమకు
రాముడిచ్చిన
కౌగిలి౦త-
రాముని
శ౦ఖారావము

మోగిన

రావణభేరి
-
ఇ౦టిగుట్టుల
విభీషణుడు
రాముని
స్నేహితుడు-
రామరావణ
యుద్ధము

రాముని

సీతావిజయము
-
పుష్పకము
వాహనముగా
రామకుటు౦బము
అయోధ్యాగమనము-
సీతారాముల
స౦గమము

రామరాజ్యము

సుఖప్రదము-

వేదాంతం వెం. సత్యవతి గారి మరి కొన్ని నానోలు:


వేదాంతం వెం. సత్యవతి గారి మరి కొన్ని నానోలు:


1
కాస్త
కలనే
కళగా
మార్చేస్తా-


2
అనుబంధాలు
దూదిపింజలే!
అల్లుకుంటే
కలంకారి-


3
కలకెంతో
కినుక
ఇల
నిలువనంటది-


4
కలైనా
కలువైనా
విచ్చుకునేది
నిశీధినే-


5
కడగండ్లని
కంటికొసన
కాటుకతో
కప్పేసా-

Wednesday, April 15, 2009

వేదాంతం వేంకట సత్యవతి గారి నుండి అందిన నానోలు:


వేదాంతం వేంకట సత్యవతి గారి నుండి అందిన నానోలు:



'నీ' 'నా'
నడుమ
వారధి
నిశ్శబ్దమే!-

నేనేటీవల
నువ్వేటావల
లంగరులేని నావా
రాయబారం?-

కంటికొలను
నీదైతే
అంచుల
హిమకుసుమం నే-
అలజడిలో
స్వాంతన
నీదేనా
(ని)నాదం-

నేనులోనే
నువ్వుంటే
ఇంకేమి
నీకీయగలను-

నీకై
నేనెపుడు
అమావాస్యకై
నీలాకాశాన్నేనా-

డా|| అద్దేపల్లి రామమోహన రావు గారు, ఈగ హనుమాన్ "నానోలు, కవిత్వం X 10-9" సంపుటి కి రాసిన ముందు మాట:

"స్తూల వస్తువు - సూక్ష్మ రూపం - నానోలు"
డా|| అద్దేపల్లి రామమోహన రావు
డి:25-02-2006


ఇటీవలి కాలంలో కవిత్వంలో లఘురూపాలకి బహుళ ప్రాచుర్యం వచ్చింది. మినీ కవిత, హైకు ప్రబలంగా ఉన్న సమయాల్లో ఆ రూపాలే ప్రధానంగా ఉండేవి. కాని ఇప్పుడు ఎన్నో రూపాలు, రూపాల్లో ప్రయోగాలు జరగడం ఎక్కువైంది. ప్రయోగంలో జనాకర్షణ, రాసే అనుకూలత ఉంటే, కొంత మంది అనుసరిస్తారు. వేరే రుపాలు కూడా వచ్చినై కానీ, అవి వైయుక్తికంగానే ఆగిపొయినై. ఏమైనా, అనువైన భావాన్ని చెప్పడానికి పుట్టిన రూపం ఏదో ఒక వైచిత్రి, ప్రత్యేకత ఉంటే అణుసరణీయమౌతుంది. లఘురూపాల మీద ఉన్న ఆకర్షనలో మరో అంశం గమనించవచ్చు: మినీ కవిత ఎక్కువగా యువ కవులు రాసినచో సామాజిక తత్వం అందులో ప్రధానంగా ఉండేది. అలాగే హైకూలలో అనుభూతి కేంద్రీకరణ ముఖ్యంగా కనిపించేది. కాని ఇప్పుడు అన్ని రూపాల్ని అన్ని వస్తువులకి వినియోగించడం కనిపిస్తుంది.

ఇప్పుడు ఈగ హనుమాన్ "నానో" అనే రూపాన్ని తన భావావిష్కరణకి ఒదిగిన లఘురూపంగా ముందుకు తెస్తున్నాడు. 'నానో' అనే పదం 'నానీ' అనే పదానికి దగ్గరగానే ఉంది గాని, హనుమాన్ ఈ పదాన్ని సమకాలీన శాస్త్ర విజ్ఞాన పరిధి లోంచి తీసుకున్నాడు. 'నానోటెక్నాలజీ' ఇప్పుడు శాస్త్రవేత్తలందరినీ కుదిపేస్తున్న అంశం. పరమాణువు దగ్గర మార్పులు చేస్తే ఒక వస్తువు మరో వస్తువైపోతుంది. బొగ్గు, వజ్రమైపోతుంది, ఇనుము బంగారమైపోతుంది. ఇది పదార్థ అద్వైత సిద్ధాంతం. స్థూలం లోంచి సూక్ష్మం లోకి పొవడం. అప్పుడు మెగా పరిశ్రమలన్నీ మినీ రూపాలకి వస్తై. మొత్తం మీద అణువైనత సూక్ష్మ రూపం లోకి పయనించడం నానో టెక్నాలజీ. కవిత్వం విషయం ఆలోచించినపుడు "నానో" అనే దానికి హనుమాన్ చేసిన అభివ్యక్తి: నాలుగు పాదాలు, ప్రతి పాదంలో ఒక్కటే పదం. ఇంతకు ముందు ఇలాంటి ప్రయోగం జరిగింది కానీ వాటిలో శబ్ధ వైచిత్రికి అనుప్రాసాలదులకి యెక్కువ ప్రధాన్యం ఇవ్వబడింది. హనుమాన్ భావ ప్రాాన్యాయాన్ని పాటించాడు.

లఘు రూపం ఏదైనా భావాన్ని క్లుప్తత లోకి ఒదిగించే ప్రయత్నమే. 'నానో' లఘురూపానికి పరాకాష్ట కాబట్టి, క్లుప్తతకి ఇంకా అవసరం ఉంటుంది. ధ్వని శక్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

"పేరెంట్స్
ప్రేమించకపోతే
పక్కింటబ్బయి
ప్రేమిస్తాడు-"

రెండు, నాలుగు పాదాల్లో 'ప్రెమా అనే ఒక్క శభాన్ని గ్రహించి అర్ధాలు మార్చడం, పై ప్రేమ వ్యతిరేఖ భావాన్ని, క్రింది ప్రేమ అనుకోల భావాన్ని చెప్పే వైరుధ్యం, చూడగానె కనిపించె వైచిత్రి. కానీ, లోతుకు వెళితే వచ్చే అర్ధం, ఇంట్లో క్రమశిక్షణ లేకపోతే, బయట ప్రమాదం పాలయ్యే అవకాశం ఉందనీ సామాజిక అంశాన్ని ధ్వనింప చేస్తుంది.

"తెంపబడే
పోగులన్నీ
పోగైతే
ఉరితాడే-"

ఈ 'నానో' లొ 'పోగూ రెండు అర్ధాలలో వినియోగించబడింది. 'పోగూ అత్యల్ప జీవి, ఇతడు హింసించబడుతున్నాడు. ఇలాంటి వాల్లు పోగైతే, సమూహంగా చేరితే, హింసించే వాడికి ఉరితాడు అవుతుంది. 'పోగూ శబ్ధం లోని వైచిత్రి ద్వరా అట్టడుగు జనుల ప్రతిఘటన ధ్వనించింది.

భావాన్ని, భాషనీ అత్యంత క్లుప్తం చేస్తున్నపుడు అనేక అభివ్యక్తులు వాటంతటవే వస్తై. మినీ కవితలొ, హైకూలలో ఎన్నెన్నో విమర్శకులు విశ్లేశించి ఉన్నారు. వాటి కంటే భిన్నమైనవి 'నానోలూ లొ రాగలవని నా అభిప్రాయం కాదు. ఎందుకంటే, క్లుప్తతా మార్గంలో వచ్చే అభివ్యక్తులు పోలిక కలిగే ఉంటయి. అయితే సమర్ధంగా కవి వినియోగించుకోగలిగాడా అన్నదే ప్రశ్న అవుతుంది. 'నానోల్లో' నాలుగు పాదాల్లొ ఒక్కొక్క పదమే కాబట్టి ఎక్కువ స్ఫురణకి కొన్ని చోట్ల అవకాశం వస్తుంది...


ఈ మార్గంలో హనుమాన్ నానోలలో కనిపించే కొన్ని వింగడించవచ్చు.

అక్షరాల పునరావృతి చిన్న కవిత లోనికి భావనని తేవడానికి ఉపయోగపడుతుంది.

జాడలు
మరిస్తే
మేడలు
కూలుతాయి-

మొత్తం నానోలోని ధ్వని ఒక సామాజిక లక్ష్యంతో ఏర్పడ్డ ఏర్పడ్డ సూత్రాలు భవిశ్యత్ సమాజ నిర్మాణనికి పునాదులుగ ఉంటై. లక్ష్యం మధ్యలో దెబ్బతినడానికి కారణం సూత్రాల్ని నిండుగా అనుసరించలేకపోవడమే. ఇందులో జాడలు, మేడలు అక్షరాల పోలిక కలిగి ఉన్నై. దీనివల్ల జాడలకి మేడలకి ఉన్న కార్య కారణ సంభందం లోని పోలిక కూడా స్ఫురిస్తుంది. ఈ తీరు ఈ సంపుటి లోని నానోలలో అధిక భాగం గమనించవచ్చు.

గేయం
గాయమై
గాయం
గేయమౌను-
గేయం అనే పదం కవిత్వానికి పర్యాయ పదం అనుకుంటే బలమైన కవిత్వం చదివితే గుండె కదులుతుంది, చదివిన వాడు కవి అయితే అలా గుండె కదిలినప్పుడు అది మరో గేయానికి ప్రేరణనిస్తుంది. నాలుగు పాదాల్లోని శబ్ధ వైచిత్రి మాత్రమే కాక మొదటి అక్షరాలన్నీ ఒకటిగానే ఉండడం వల్ల కూడా భావానికి బలం వస్తోంది.

సూక్ష్మ రూపంలో ఉన్న అవకాశం వల్ల భావానా శాక్తితో కూడిన కొన్ని నానోల్లో పాఠకుడు కవి చెప్పని అనుభూతి పొరల్లోకి ప్రయానించే అవకశముంది.
ఉదాహరణకి:
గంతలు
బిగించినా
ఒళ్ళంతా
కళ్ళవుతై-

'గంతలు కళ్ళు కంబడకుండా కట్టేవి. గంతలు కడితే ఒంటి నిండా కళ్ళు నిండి పోతై. అంటె ఏది ముఖ్యమో దాన్ని నిరోధిస్తే అది తన లక్ష్యాన్ని వదలదు. మరో రకంగా వేరు ప్రదేశాల్లో నుండి అదివరకటి శక్తిని వంద రెట్లు ప్రదర్శిస్తుంది. సాదారణంగా నేత్రాలు లేని వారు, నేత్రాలు ఉన్న వారి కంటే ఎక్కువ స్పృహని మరో విధంగా కలిగి ఉంటారనేది లోకంలో గమనించేదే. అయితే దీన్ని ఆధారంగా ఆలోచిస్తే పైన భావం స్ఫురిస్తుంది. ఇంకో విధంగా సమకాలీన విషయ నేపధ్యంలో ఒక రచనని ప్రభుత్వం నిషేధిస్తే ఆ స్ఫుర్తి ఆగదనీ మరో విధంగ వందరెట్లు వ్యక్తమవుతుందని కూడా వెంటనే తట్టుతుంది. ఇది స్ఫురించడానికి పైన చెప్పినట్లు సమకాలినత ప్రధానమవుతుంది. మరో తక్షణ స్ఫూర్తి, నిరోధించడం చేత, మంచి భావలు ఆగకపోవడం, మనిషి లోని సంకల్ప శక్తి వల్లనే. ఆ సంకల్ప శక్తిని కూడా ఈ నానో ధ్వనింప చేస్తుంది. ఇలాంటివి ఈ సంపుటిలో కొద్ది సంఖ్యలోనే ఉన్నా ఈ పార్శ్వం వినియోగించడంలోనే మెళకువకే పై ఉదాహరణ.



సూక్ష్మ రూపంలో ఉన్న అవకాశం వల్ల భావానా శాక్తితో కూడిన కొన్ని నానోల్లో పాఠకుడు కవి చెప్పని అనుభూతి పొరల్లోకి ప్రయానించే అవకశముంది.
ఉదాహరణకి:
గంతలు
బిగించినా
ఒళ్ళంతా
కళ్ళవుతై-

'గంతలు కళ్ళు కంబడకుండా కట్టేవి. గంతలు కడితే ఒంటి నిండా కళ్ళు నిండి పోతై. అంటె ఏది ముఖ్యమో దాన్ని నిరోధిస్తే అది తన లక్ష్యాన్ని వదలదు. మరో రకంగా వేరు ప్రదేశాల్లో నుండి అదివరకటి శక్తిని వంద రెట్లు ప్రదర్శిస్తుంది. సాదారణంగా నేత్రాలు లేని వారు, నేత్రాలు ఉన్న వారి కంటే ఎక్కువ స్పృహని మరో విధంగా కలిగి ఉంటారనేది లోకంలో గమనించేదే. అయితే దీన్ని ఆధారంగా ఆలోచిస్తే పైన భావం స్ఫురిస్తుంది. ఇంకో విధంగా సమకాలీన విషయ నేపధ్యంలో ఒక రచనని ప్రభుత్వం నిషేధిస్తే ఆ స్ఫుర్తి ఆగదనీ మరో విధంగ వందరెట్లు వ్యక్తమవుతుందని కూడా వెంటనే తట్టుతుంది. ఇది స్ఫురించడానికి పైన చెప్పినట్లు సమకాలినత ప్రధానమవుతుంది. మరో తక్షణ స్ఫూర్తి, నిరోధించడం చేత, మంచి భావలు ఆగకపోవడం, మనిషి లోని సంకల్ప శక్తి వల్లనే. ఆ సంకల్ప శక్తిని కూడా ఈ నానో ధ్వనింప చేస్తుంది. ఇలాంటివి ఈ సంపుటిలో కొద్ది సంఖ్యలోనే ఉన్నా ఈ పార్శ్వం వినియోగించడంలోనే మెళకువకే పై ఉదాహరణ.

ఇప్పుడు వస్తున్న లఘు రూపాలన్నీ పూర్తిగా కొత్తవని చెప్పడానికి సాధ్యం కాదు. ఇదివరలో ఒక నియతితో లేని రూపాన్ని ఏదొ విధంగా నిబద్ధం చేయబడంలో అది ప్రత్యేక ఆకర్శణ అవుతుంది. నానీ లాగా నాలుగు పాదాల మినీ కవితలు ఇంతకు ముందు అసంఖ్యాకంగా వచ్చినవి. అయితే నాలుగు పాదాలే ఉండాలని అప్పుడు అనుకోలేదు. ఇప్పుడీ నాలుగు పాదాల్లో నిబంధించడం ఆకర్షనను పొందింది. అంటే ఇది ఒక నియతీకరణ (0. అలాగే నాలుగు పాదాల్లో ఒకొక్క పాదాన్ని ప్రయోగిమంచిన మినీ కవితలు వచ్చినవి. అయితే గభీరమైన సామాజిక చైతన్య భావాలు, శిల్ప స్పృహ ముఖ్యంగా భావించినవి ఈ "నానోలు". నానీ గానీ నానో గానీ ఈ నియతీకరణ వల్ల ఆకర్శనీయాలౌతై.

ఏ చిన్న రూపమైనా బతికేది కవి శక్తి వల్లనే. ఒక రూపాన్ని ఒక భావాన్ని ఒదిగించడంలోని శిల్పమే ఆ రూపాన్ని బతికిస్తుంది. లఘురూఫలలోనే ఒక రూపాన్ని మరో రూపన్నించి భిన్నంగా చూపించేది ఇదే. నాలుగు లేదా మూడు లేక రెండు పాదాలుగా రాసినా భేదం కనిపించకుండా ఉంటే అది విఫలమైన రూపం. అలా కాకుండా శబ్ధం లోని లయ భావం లోని లయ పాదాల సంఖ్యను అనివార్యం చెస్తే అది ఆ ప్రత్యేక రూపానికి ప్రాతింధ్యం పొందుతుంది.

హనుమాన్ నానోల్లో పైన చెప్పిన అంశాలన్ని సమగ్ర రూపంలో వున్నాయని నేను చెప్పడం లేదు. కానీ, ఈ అభివ్యక్తుల్ని తొంబై పాళ్ళ కవితల్లో అనుసరించగలిగాడు. ఈ అభివ్యక్తుల్ని ఇంకా ఇంకా విస్తృతం చేసుకొనే అవకాశం ఉంది.

కొత్తదనం పట్ల ఆసక్తి ఉండడం సృజన రంగంలో ఎప్పుడూ ప్రశంసనీయమే. అందుకు ఈగ హనుమాన్ ను అభినందిస్తున్నా.
డా|| అద్దేపల్లి రామమోహన రావు
ది:25-02-2006



Tuesday, April 14, 2009

పద్మకళ గారి ఒక నానో;



పద్మకళ గారి ఒక నానో

తీవ్రవాదపు
ఆకలి
మల్లెపూలు
మంటలపాలు -

Monday, April 13, 2009

సమిధ ఆన౦ద్ గారి నానోలు:

సమిధ ఆనంద్ గారి నుండి అందిన నానోలు:
ఆశ

నిచ్చెన
దురాశ
పాము-



జీవి౦చడ౦

పాఠ౦
జీవితమే
మాష్టారు-

సమస్య
"నేను"
పరిష్కార౦
"మన౦"-

రూప౦
మనిషి
ఆత్మ
భగవ౦తుడు-

విజయ౦
పువ్వులైతే
కలలే
మొగ్గలు-


దైవపూజ౦టే
ల౦చము
మానవసేవలో
మోక్షము-


పుట్టినమనిషి
చెట్టు
చేసినపనులు
బీజాలు-

బ్రతకడ౦
హారతైతే
రైతు
కర్పూర౦-

బిడ్డలు
వెలుగు
తల్లిద౦డ్రులు
దీపాలు-
సృష్టికి
కారణ౦
చీకటితెరపై
విస్ఫోటన౦-
చూపుకి
వెలుగవసర౦
క౦టికి
చీకటవసర౦-
మనసుకు
చూపు౦టే
నరుడు
నారాయణుడు-

Sunday, April 12, 2009

పద్మకళ గారి నానోలు:


పద్మకళ గారి నానోలు:

వద్దన్నా
వచ్చేస్తూ

భయపెడ్తుంది

వయసుభూతం-


నాలుక

పదునెక్కువైతే

చెవులు

చిల్లుపడాల్సిందే-

Saturday, April 11, 2009

నానోల పూమాలకి మరువం గుచ్చినవి


నానోల
పూమాలకి
మరువం
గుచ్చినవి
-


గర్భస్రావం
పుట్టకేడ్పించినవారు

గర్భశోకం

పుట్టేడ్పించినవారు-

సమస్య
గొంగళైతే
పరిష్కారం
సీతాకోకచిలుక-
అమ్మవొడి
ఓనమాలు

గురువాక్కు

గుణింతాలు-
స్వగతం
అగనికాలం
స్వానుభవం
ఆరనిదీపం-
ముందడుగు
హిమశిఖరం

కాలిజాడలు

నదీప్రవాహాలు-
స్ఫూర్తి
ప్రజ్వలనం
విజయం
యజ్ఞఫలం-
ప్రయత్నం
చివురాకు

సాంగత్యం

పత్రహరితం-
సాధన
అంకురం
సఫలం
వృక్షం-
స్నేహాలు
సప్తస్వరాలు

స్నేహితం

సురాగానం-
సంకల్పం
ఆశయానుగుణం
సఫలమైతే
అమరత్వం_


ఆచార్య చేకూరి రామారావు (చేరా) గారు, ఈగ హనుమాన్ "నానోలు, కవిత్వం X 10-9" సంపుటి కోసం రాసిన ముందు మాట:

తెలుగు కవిత్వానికి మరో సరికొత్త కవితా రూపం "నానోలు"
--చేరా (ది: 21-12-2005)


ఈ 'నానోలు" కవిని పక్కన కూర్చోబెట్టుకొని చదివాను. కవి పేరు ఈగ హనుమాన్. ఈ కవిలాగే నానోలు గహనంగా ఉన్నై. ఇతని పేరులో ఒక వైరుధ్యముంది. ఇంటి పేరు ఈగ. చాలా చిన్న జేవికి సంకేతం. ఇతని పేరు హనుమాన్, అపారమైన శక్తికి సంకేతం. ఇతని పేరును అర్ధంచేసుకోవదానికి ఎంత శ్రమపడాలో కవిత్వాన్ని అర్ధంచేసుకోవదానికి అంతే శ్రమ పడాలి. ఈయన ఈ కవితా ఖండికలకు "నానోలు" అని పేరు పెట్టారు. ఇది శాస్త్రపరిభాషలో పదం. దాని అర్ధం సంగతెలా ఉన్నా ఆయన ఉద్దేశించింది అతి తక్కువ పదాల్తో ఎక్కువ భావాన్ని వ్యక్తీకరించడం. ప్రాచీన కాలం నుంచి చాలా భాషల్లో తక్కువ మాటల్లో ఎక్కువ కవిత్వాన్ని చెప్పడానికి ప్రయత్నాలు జరిగాయి. ప్రాకృతం లో గాతలు, జపనీస్ లో హైకూలు, ఈ ప్రయత్నంలో భాగాలే. ఇందులో ప్రధానమైన ప్రయత్నం ఏమిటంటే, కవి తక్కువ చెప్పి పాటకుడి మేధకు, ఊహకు ఎక్కువ వదిలేయదం. దీంట్లో ఉన్న సౌకర్యమేమిటంటే పాఠకుడు కూడా కవితో సమానంగా ఊహిస్తాడు. ఒక్కోసారి కవి ఊహించని విషయాన్ని కూడా పాఠకుడు ఊహించే అవకాశముంది. కవిత పెద్దదైతే స్పష్టత పెరుగుతుంది. దాని వల్ల ఊహల్లో వైవిధ్యముండదు. కవిత సైజు తగ్గినా కొద్దీ పఠకుడి ఊహ పెరుగుతుంది. ఒక్కో కవితకు పాఠకుడు ఊహా బలాన్ని బట్టి ఎన్నో రకాల అర్ధాలు స్ఫురించవచ్చు. ఒక నాటి హైకూలలో అక్షరనియమముండేది. ఐతే ఆ అక్షరనియమం ఇతర భాషల్లో సధ్యం కాదు. ప్రాకృత గాధా చందస్సుగ్గూదా అక్షర నియమాలూన్నాయి. ఇవన్నీ కూదా తక్కువ అక్షరాల్లో ఎక్కువ భావాన్ని చెప్పడానికి ఉద్దెశింఛినవే. ఐతే ఈ "నానోలు" ఇప్పుడు ప్రచారములోనూ, అమల్లోనూ ఉన్న కవితా రూపాలకన్నా చాలా చిన్నవి. బహుశా: ఇంతకన్నా చిన్న కవితారూపాలు సాధ్యం కావేమో, సాధ్యమైతే ఒకే పదాన్ని కవిత్వంగా చెప్పే పద్ధతేమైనా వస్తుందేమో తెలియదు. దాని గురుంచి ఇప్పుడు ఊహ చేయలేం.

హనుమాన్ ఒట్టి కవి మాత్రమే ఐతే నా ప్రాణం హాయిగా ఉండేది. అతను సైకాలజిస్టు, వివిధ భౌతికశాస్త్రాల గురించి మామూలు పాఠకులకు అందనంత పాండిత్యముంది. ఆ పాండిత్యం చాలా తరుచుగా ఈయన కవిత్వంలో దర్శనమిస్తూ మనల్ని ఆటలు పట్టిస్తుంది. నా మట్టుకు నాకు ఎన్నో శాస్త్ర విషయాలు చదివి తెలుసుకోవాలన్న అభిలాష ఉంది. నిజనికట్లా చదివి ఎన్నో విషయాల్ని గ్రహించాను. ఐతే నన్ను కూడా తికమక పెట్టిన శాస్త్ర "నానోలు" ఉన్నాయి.
"బిగ్ బ్యాంగ్
బిగ్ క్రంచ్

పునరపి

పునరపి-
"

నాకు బిగ్ బ్యాంగ్ థియరీ గూర్చి తెలుసు, బ్లాక్ హోల్స్ గూర్చి చదివాను. స్టీఫెన్ హాకింగ్ గూర్చీ, అతని పుస్తకాలు చదివాను. కాని బిగ్ క్రంచ్ అనేది నాకు తెలియదు. ఇక బిగ్ బ్యాంగ్ గూర్చే తెలియని వాల్లకి ఇది అస్సలు అందదు. ఇతని నానోల్లో విస్త్రుతి చాలా ఎక్కువే. సాధారణంగా కవితా రూపాలకు కొన్ని రకాల పరిమితులు నిర్ధిష్టంగాను, అనిర్ధిష్టంగానూ ఉంటయి. ఉదాహరణకి హైకూలకు అక్షర పరిమితే కాక, వస్తుపరమైన పరిమితీ ఉన్నది. అవి ప్రకృతికే పరిమితమైనవి. అట్లాగే ఋతువులు కూడా ఉండాలనే పరిమితి ఉంది. బహుశా; ఈ పరిమితులు కవిత్వాన్ని అర్ధం చేసుకోవడానికి లేదా భావించడానికి మార్గదర్షకాలుగా పనికొస్తాయి. క్లుప్తతే లక్ష్యంగా ఏర్పడ్డ ఈ నానోలకు ఇతర పరిముతుల్లేవు. కొన్ని చోట్ల సాధారణ విషయాలు చెప్పినపుడు ముఖ్యంగా ప్రకృతికి సంబందించిన విషయాలకొస్తే అదృష్టం కొద్దీ పాఠకుడికి అందుతాయి.

ఉదాహరనకి:

"శిశిరo
గాయానికి
వసంతం
ఆయింట్ మెంట్-
'


శిశిరం ఆకులు రాలే కాలమని అందరికి తెలిసిందే, వసంతంలో చెట్లు చిగురిస్తాయి. ఈ రెంటి సంబంధాన్ని చెప్తూ శిశిరాన్ని గాయంతోనూ, వసంతాన్ని ఆయింట్ మెంట్ తోనూ పోల్చడం మనకర్ధమౌతుంది/ అందుతుంది. అట్లాగే సాధారణ సామాజిక పరిస్థితుల గురించి చెప్తున్నపుడు ఎక్కువ శ్రమపడకుండానే చెప్పింది గ్రహించగలం:

"బావులు
ఇంకితే
బోర్లు
పొడుచుకొస్తై-"


నీళ్ళు పైనే ఉంటే బావులు తవ్వుతాం, బావుల్లో నీళ్ళు ఇంకిపోతే కొన్ని వందల అడుగులు లోతుల్లో వెళ్ళి బోర్లు వెయక తప్పదు. ఈ రెంటి సంబంధాన్ని పొడుచుకురావడమనే క్రియ వల్ల మనకర్ధమయ్యే కవిత్వముంది. ఈ రకంగా నేటి సమాజములో కనిపించే అనేక విషయాలను కవిత్వీకరించిన నానోలు ఇందులో ఛాలా ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల సెల్ ఫొన్ల వ్యాప్తి అందరికీ తెల్సిందే. ఈ మధ్య బజార్లొ చేపలు అమ్మేవాడు సెల్ ఫోన్ వాడడం చూసి ఆశ్చర్య పోయాను. పదహారేళ్ళ అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర్నుంచి, 70-80 ఏల్ల వృద్ధుల వరకు ఈ సెల్ ఫొన్లు వాడుతునే ఉన్నారు. దాన్ని నాజూగ్గా చెబుతూ..

"టెలీఫోన్
సెలవమ్మా
సెల్ ఫొన్
ముద్దుగుమ్మా-"


అంటూ ఒక నానో రాశారు. ఈ నానోలలో క్లుప్తత ప్రధాన లక్ష్యంగా ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తుంది. మనకు అనుభవం లోకి వచ్చే అనేక విషయాల గూర్చి ఈ నానోలు ప్రస్తావిస్తాయి. ఈ నానోల్లో వ్యంగ్యం కన్నా వాక్య వక్రత ప్రధాన కవితా మార్గంగా కనిపిస్తుంది.

ఈ వక్రతను ప్రాచీన అలంకారికుల్లో కుంతకుడు సూచిస్తాడు. తర్వాత, ఇతని నానోల్లో సాధారణంగా చాలా కవితా రూపాల్లో కనిపించే అంత్యప్రాసాది పద్ధతుల్ని గూడా వాడుకున్న ధోరణి కనిపిస్తుంది. చాలా నానోలు కొద్దిపాటి సమయం వెచ్చిస్తే అర్ధం కాకుండా పోవు. వీటిని అర్ధం చేసుకోవడానికి కావల్సింది కాస్త ఆలోచన, ఏకాగ్రత. ఇక ఆయనకు తెలిసిన సైన్సును నిక్షేపించిన నానోలు మన జ్ఞానాన్ని బట్టి మనకు అందవచ్చు, అందకపోవచ్చు, వాటికి మనము చేయగలిగింది ఏమీ లేదు. ఆఖరుగా ఒక మాట, ఈ నానోల్లో అక్కడక్కడ ఆయన రాజకీయ, సాంఘీక అబిప్రాయాలూ తొంగి చూస్తుంటాయి, అవి అందరికీ నచ్చకపోవచ్చు. నాకు నచ్చని కొన్ని అట్లంటి అభిప్రాయాలు కనిపించాయి, వాటిని పేర్కొని మీ కాలాన్ని వృధా చేయడం నాకిష్టం లేదు.

తెలుగులో నానోలు పేరుతో పొదుపే ప్రధాన లక్ష్యంగా మరో కవితా రూపాన్ని ప్రవేషపెట్టిందుకు హనుమాన్ ని మనసారా అభిందిస్తున్నా...

--చేరా, ది: 21-12-2005



Friday, April 10, 2009

హిందిలో నానోలు (నానోయే= नानोये)

सवेरा बनके

आऊंगा

अंधेरोंका

बरसात से-

(దయచేసి అభిప్రాయాన్ని

తెలియచేయండి)

Thursday, April 9, 2009

అరిపిరాల సత్యప్రసాద్ గారి నుండి అందిన నానోలు:


అరిపిరాల సత్యప్రసాద్ గారి నుండి అందిన నానోలు:
1
చెట్టుకు
పూయని
పూవు
సీతాకోకచిలక-

2
చీకటి
చివరి
మజిలి
వెలుగేగా-

3
చలికాలం
పేదవాడి
వెచ్చదనం
ఆకలిమంట-

4
బ్రతుకుబడిలో
తీపిగుర్తులు
కలలు
కల్లలు-

5
ప్రేమవనంలో
పూలూ
మూళ్ళూ
కలిసేవుంటాయ్-

6
చింపేసిన
క్యాలండర్
తిరిగిరాని
కాలం-

7
పూల
పెదాలపై
తుమ్మెద
ముద్దుగుర్తులు-

8
మనసుకు
నేత్రదానం
కవితకు
భావుకత్వం-


9
పక్షులు
వలసెళ్ళాక
కిలకిలలన్నీ
గిలకబావివే-

10
చెట్టుకొట్టే
గొడ్డలికర్ర
చెట్టుకు
పుట్టిందేగా-

11
ఆలోచన
మహావృక్షం
బోన్సాయ్
నానో-

డా|| దాస్యం రూత్ మేరీ గారి నుండి అందిన నానోలు


డా|| దాస్యం రూత్ మేరీ గారి నుండి అందిన నానోలు:

1
రాలినపూలు
తరువులకు
పారాణి
అద్దుతున్నై-


2
పండుటాకు
రాలిపోలేదు
వసంతమై
పల్లవిస్తోంది-


Monday, April 6, 2009

ఏ ఏ ప్రాంతాల నుండి నానోలు రాయబడుతున్నయో చూడండి(జిల్లాల వారిగా)



ప్రాంతాల నుండి నానోలు రాయబడుతున్నయో చూడండి(జిల్లాల వారిగా):

ఖమ్మం

హైదరాబాద్
కరీం నగర్
ఆదిలాబాద్
తూర్పు గోదావరి
కృష్ణా
నల్లగొండ
పశ్చిమ గోదావరి.. ఇంకా
అతర్జాలంలోంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి

Saturday, April 4, 2009

అంతర్జాల పత్రికల్లో నానోలు (పొద్దు అంతర్జాల పత్రిక వారు నానోలు, నానో కవిత్వం గూర్చి ప్రస్తావించారు)

పొద్దు అంతర్జాల పత్రిక వారు నానోలు, నానో కవిత్వం గూర్చి ప్రస్తావించారు, ఈ కింది లింకు చూడండి:

'http://poddu.net/?p=౨౫౦౩" లో
"2009 మార్చి బ్లాగువీక్షణం " శిర్షిక కింద
'ఉగాది నాడు నానో కవితల వేడుక" అని ప్రస్తావించబడింది.

నానోలు, నానో కవిత్వ రూపం, శిల్పం ఇత్యాదుల పై చర్చకు ఆహ్వానం:

చర్చను కొనసాగిద్దామా??

1
?ప్ర :: చమత్కార పదాల కూర్పు కవిత్వమైపోతుందా?

నాకెందుకో ఇలాంటి ప్రక్రియల తో వ్రాసిన వాటిని కవితలని అనబుద్దవ్వదు. వీటిని కవితల శకలాలుగానో, లేక పదచిత్రాలు గానో మాత్రమే మనసు ఒప్పుకొంటుంది. (ఇది ఒక పాఠకునిగా నా అభిప్రాయం మాత్రమే. ఎందుకు వ్రాస్తున్నానంటే, ఇలాంటి అభిప్రాయంతో కూడా కొందరు పాఠకులు ఉంటారన్న విషయం మీకు తెలియాలి కనుక)

ఎనభైలలో మినీ కవితల ఉద్యమం రాకముందే శ్రీ సోమసుందర్ గారు తాము వ్రాసుకొన్న ఇలాంటి శకలాలకు రాలిన ముత్యాలు అని పేరు పెట్టుకొన్నారు.

హైకూల పరిధి, లోతు వేరు.
మినీ కవితలను కొంతవరకూ ఆస్వాదించవచ్చును. ఎందుకంటే కొన్ని ఆరేడు లైన్లు కూడా ఉండేవి కనుక.

ప్రతిభకలిగిన మీబోటి వారు ఇలాంటి పదాల విరుపులకు, చమత్కార వచనానికి పరిమితమవ్వటం కవిత్వానికి అన్యాయం చేయటమే.

బొల్లోజు బాబా


=:: బొల్లోజు బాబా గారు!

మీ కామెంట్ కు ధన్యవాదాలు.

సవినయంగా మీకు తెలియచేసుకునేదేంటంటే:
వచన కవిత్వం నా మేయిన్ ప్రాడక్టయితే, ఈ "నానోలు" నా బైప్రాడక్ట్ మాత్రమే. తెలుగు కవిత్వం నిత్య నూతనమైనది. ప్రయోగాలను ఆహ్వానిస్తుంది, ఆదరిస్తుంది, కవిత్వముంటే.

ఈ ప్రయోగంతో యెక్కువ మందిని సాహిత్యానికి దగ్గర చేసినవాల్లమవుతామేమోనని నా ఆశ. ఇవి నిలుస్తాయా లేదా అన్నది కాలమే తేలుస్తుంది. భాష మీద ప్రేమతో చేసిందే ఈ ప్రయోగం గనుక మనస్ఫూర్తిగా "నానోల" ని ఆహ్వానిద్దాం. దోశాలుంటే పరిహరించుకుంటూ నానోలని కూడా దీవీద్దాం.

మీ
ఈగ హనుమాన్

హనీ గారు
(పేరు పలకటానికి బాగుందండీ :-))

నమస్తే
మీ వివరణ బాగుంది.


2
హనుమాన్ గారు పై నానోలు చాలా బాగున్నాయి.--తెలుగు అభిమాని

all the best for your work keeping in బ్లాగ్స్ - అనామకుడు


3
ఈగ హనుమాన్ గారు,
మీరు ప్రచురించిన "నానోలు, కవిత్వం X 10-9" పుస్తకం బయట ఎక్కడా కనపడలేదు, కారణం చెప్పండి. వీలైతే అన్ని పత్రికలకు పంపి విస్తృత ప్రచారం కల్పించండి, చక్కటి ప్రిక్రియని పది కాలాల పాటు బ్రతికేట్లు దీవిద్దాం. సంజు-ప్రీతు

మిత్రమా! మీ కామెంటుకి ధన్యవాదాలు.
కొన్ని అనివార్య కారణాల వల్ల, కొద్ది కాపీలే వెయడం వల్ల, అన్ని పత్రికలకు పంపలేక పోయా. త్వరలో మళ్ళీ అచ్చొత్తించి, పత్రికలకి పంపిస్తాను.
మీ
ఈగ హనుమాన్


4
మిత్రమా!
గత కొన్ని రోజులుగా పత్రికల్లో, అంతర్జాలంలో చూస్తున్నా, "నానోలు" ప్రక్రియ చాలా ప్రతిభావంతంగా, వినూత్నంగా ఉన్నాయి, వదిలిపెట్టకండి.
రాసే వాల్లను ఎంకరేజ్ చేయండి, మీరూ విజృంభిచండి.


5
బాగున్నాయి బాగున్నాయి

ధన్యవాదాలు విజయమోహన్ గారు.
మీరు సృజనశీలురే కనుక, మీరూ ప్రయత్నించండి నానోలు నాలుగైదు.
All the best.
ఈగ హనుమాన్.


6
నానోలు చాలా భిన్నంగా ఉన్నాయి.
చక్కతి ప్రయోగం.
విజృంభించండి.


7
నానో అన్న పేరు చక్కగా కుదిరింది. ఇది మీరే కనిపెట్టారా? సముచితంగా ఉంది. మీ నానోలు కూడా చాలా బాగున్నాయి
-తెలుగు అభిమాని


8
after long time welcome to blogs
and all the best for the upcoming పోస్ట్స్ - జాన్ హైడ్


9
మంతనాలెన్ని
చేసినా
మనిషిగా... idi chaalA baagundandi.
-Darla
http://vrdala.blogspot.కం

10
Dear Hanuman garu,
mee blog choosanu.konni nanolalo Telugu lo kooda oka pankti lo rendu words vachhinattunnaye? for eg:
malamala maadina....kalapa taruvu...etc.
ika veetini Hindi loki anuvadinchaalante chaala time padutundi...paiga inta baaga ravani anukuntaanu...at least naaku saadhyam aye pani kaadu.Vijaya Raghava Reddy gaaro, SANA ane peruto naneelu translate chesina Satyanarayana garo chestaaremo adagandi.Satyanarayana garu Hyd. Hindi Academi lo pani chestunnaru


untaanu...sincerely,santha సుందరి

మీ స్పందనకు ధన్యవాదాలు, మేడం.
ఒక పదమనేది అది సంధి అయినా లేదా సరళ సమాసమైనా కావచ్చు, అందుకనే మీరు లేవనెత్తిన పదాలను, కోవలోకి క్లాస్సిఫై చేయవచ్చు.
మీరు చూచించినట్లు వారినీ సంప్రదిస్తాను, ప్రయత్నిద్దాం. వీలు కాకపోతే వదిలేద్దాం. కలకాలం మీ సాహిత్య స్నేహాన్ని కోరుకుంటూ..
మీ
ఈగ హనుమాన్


11
"ముందు మాటలు" వలన కాస్త జ్ఞనం కలిగింది నానోలను గురించి. పద్మ కళ గారి 'రెక్కలూ కూడా ఇటువంటిదే ననుకుంటా ప్రయోగం.

నీనోటి మాట
నానోలట,
నానోటి వెంట
నానాలిక!

ఎలావుందండి 20 సెకన్లలో నా నానో ప్రయోగం?
-ఉష

20 సెకన్లలో నానో చెప్పేసారుగా, ఇక సమయం తీస్కొని, తాదాత్మ్యం లోంచి మీరు నానోలు చెబితే, ఎంత బావుంటాయో, అయితే సుమా!, పాదానికి ఒకే ఒక్క పదం అది సంధి లేదా సరళ సమాసమైనా ఓకే, ఏదీ ప్రయత్నించండి చూద్దాం..
మీ
ఈగ హనుమాన్.

Friday, April 3, 2009

పద్మకళ గారి నుండి అందిన నానోల్లో కొన్ని

పద్మకళ గారి నుండి అందిన నానోల్లో కొన్ని

నీతినియమాలనే
లాలగా
పోసేది
మహా తల్లి-

ఆకారం
లేని
ద్రవాలు
పిల్లలు-

వాడని
పువ్వు
పెదవులపై
నవ్వు-

ఓ ప్రాణం
నిలపమంటూ
మరో ప్రాణి
బలిదానం!-


Tuesday, March 31, 2009

2005 నుండి ఇప్పటి వరకు నానోలు ప్రచురించి ప్రోత్సహించిన పత్రికలు

2005 నుండి ఇప్పటి వరకు నానోలు ప్రచురించి ప్రోత్సహించిన పత్రికలు:

భావతరంగిణి (మొదటి సారి సెప్టెంబర్ 2005 ఇష్యూ లో నానోలని ప్రకటించినదీపత్రికే)
నవ్య
ప్రజాసాహితి
చినుకు
ఆంధ్రభూమి (ఆదివారం అనుబంధం)
ప్రజాశక్తి
ప్రస్థానం
పత్రిక
నేటినిజం
ధ్యానమాలిక
ప్రసారిక
రమ్యభారతి
విజ్ఞాన సుధ
సర్కార్ ఎక్స్ ప్రెస్
ఉద్యోగక్రాంతి
మల్లెతీగ
ఆకాశిక్
..ఇంకా ఏ పత్రికైనా మీ దృష్టికి వస్తే తెలియచేయగలరు.

నానో కవులు - పరిచయం

2005 నుండి ఇప్పటి వరకు నానోలు రాసినవారు, రాస్తున్న వారు

ఈగ హనుమాన్,
బద్ది నాగేశ్వర రావు
,
డా|| తిరునగిరి

బొబ్బిలి జోసెఫ్,
బి. ఇందిర
,
మరువం ఉష
,
ఆదిశేషా రెడ్డి

కొల్లి రాజా,
బొమ్మరాత యెల్లయ్య
,
పోతగాని సత్యనారాయణ

శిరంశెట్టి కాంతారావు,
డా|| కాసర్ల రంగారావు
,
చందుపట్ల శ్రీధర్

తోకల రాజేషం,
మాల్యశ్రీ
,
వీధుల రాంబాబు
,
ఆడెపు ముత్యాల్రావు

బీర శ్రీనివాస రావు,
డా|| దాస్యం రూత్ మేరీ
,
జి.వి.ఆర్.కే.సుబ్బరాయ మూర్తీ

శంకర్ రెడ్డి
పద్మకళ

..... ఇంకా కొందరు


(గమనిక:- వీరి సాహిత్య చరిత్రను కూడా త్వరలో పొందుపర్చబడుతుంది, వీలైతే పంపించండి)

Monday, March 30, 2009

కొల్లి రాజా గారి నానోలు

సాహితీ పయనం - నానోల దాకా
1
క్లుప్త
పదాల
గుప్త
భావాలు-

2
కలాల
కూర్పులు
కాలపు
మార్పులు-

3
నవలకి
నో..నొ.. లు
నేనేలు
నానోలు-

4
తేనెల
నానోలుపై
ఈగలమై
మే వాలు

నన్నయ
భారతం
సాహితీ
గిగారధం-

ఆది మెగా
ప్రభందం
ఆమూక్తమాల్యద
పదబంధం-

........ఇంకా ఉన్నాయి

ఆది శేషా రెడ్డి గారి నుండి అందిన నానోలు:

1.
కాబోయే
ర్యాంకర్లు
కార్పొరేట్లకు
బ్యాంకర్లు-


2.
నీ నవ్వు
కనిపిస్తూంది
విరిసిన
పువ్వుల్లో-


3.
కనిపిస్తోంది
నీరూపం
నాకళ్ళలో
జొరబడి-

Saturday, March 28, 2009

విరోధి నామ ఉగాది ఉత్సవాల సంధర్భంగ నానోలు బ్లాగును సహజ కవి కోకిల డా|| అందెశ్రీ, ప్రముఖ కవి & విమర్శకుడు ఎస్సార్ బల్లం లు ఆవిష్కరించారు. ఫోటోలు:











విరోధి నామ ఉగాది ఉత్సవాల సంధర్భంగ పాల్వంచలో నానోలు బ్లాగును సహజ కవి కోకిల డా|| అందెశ్రీ, ప్రముఖ కవి & విమర్శకుడు ఎస్సార్ బల్లం లు ఆవిష్కరించారు. ఆ తాలూకు ఫోటోలు: