అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Saturday, April 11, 2009

ఆచార్య చేకూరి రామారావు (చేరా) గారు, ఈగ హనుమాన్ "నానోలు, కవిత్వం X 10-9" సంపుటి కోసం రాసిన ముందు మాట:

తెలుగు కవిత్వానికి మరో సరికొత్త కవితా రూపం "నానోలు"
--చేరా (ది: 21-12-2005)


ఈ 'నానోలు" కవిని పక్కన కూర్చోబెట్టుకొని చదివాను. కవి పేరు ఈగ హనుమాన్. ఈ కవిలాగే నానోలు గహనంగా ఉన్నై. ఇతని పేరులో ఒక వైరుధ్యముంది. ఇంటి పేరు ఈగ. చాలా చిన్న జేవికి సంకేతం. ఇతని పేరు హనుమాన్, అపారమైన శక్తికి సంకేతం. ఇతని పేరును అర్ధంచేసుకోవదానికి ఎంత శ్రమపడాలో కవిత్వాన్ని అర్ధంచేసుకోవదానికి అంతే శ్రమ పడాలి. ఈయన ఈ కవితా ఖండికలకు "నానోలు" అని పేరు పెట్టారు. ఇది శాస్త్రపరిభాషలో పదం. దాని అర్ధం సంగతెలా ఉన్నా ఆయన ఉద్దేశించింది అతి తక్కువ పదాల్తో ఎక్కువ భావాన్ని వ్యక్తీకరించడం. ప్రాచీన కాలం నుంచి చాలా భాషల్లో తక్కువ మాటల్లో ఎక్కువ కవిత్వాన్ని చెప్పడానికి ప్రయత్నాలు జరిగాయి. ప్రాకృతం లో గాతలు, జపనీస్ లో హైకూలు, ఈ ప్రయత్నంలో భాగాలే. ఇందులో ప్రధానమైన ప్రయత్నం ఏమిటంటే, కవి తక్కువ చెప్పి పాటకుడి మేధకు, ఊహకు ఎక్కువ వదిలేయదం. దీంట్లో ఉన్న సౌకర్యమేమిటంటే పాఠకుడు కూడా కవితో సమానంగా ఊహిస్తాడు. ఒక్కోసారి కవి ఊహించని విషయాన్ని కూడా పాఠకుడు ఊహించే అవకాశముంది. కవిత పెద్దదైతే స్పష్టత పెరుగుతుంది. దాని వల్ల ఊహల్లో వైవిధ్యముండదు. కవిత సైజు తగ్గినా కొద్దీ పఠకుడి ఊహ పెరుగుతుంది. ఒక్కో కవితకు పాఠకుడు ఊహా బలాన్ని బట్టి ఎన్నో రకాల అర్ధాలు స్ఫురించవచ్చు. ఒక నాటి హైకూలలో అక్షరనియమముండేది. ఐతే ఆ అక్షరనియమం ఇతర భాషల్లో సధ్యం కాదు. ప్రాకృత గాధా చందస్సుగ్గూదా అక్షర నియమాలూన్నాయి. ఇవన్నీ కూదా తక్కువ అక్షరాల్లో ఎక్కువ భావాన్ని చెప్పడానికి ఉద్దెశింఛినవే. ఐతే ఈ "నానోలు" ఇప్పుడు ప్రచారములోనూ, అమల్లోనూ ఉన్న కవితా రూపాలకన్నా చాలా చిన్నవి. బహుశా: ఇంతకన్నా చిన్న కవితారూపాలు సాధ్యం కావేమో, సాధ్యమైతే ఒకే పదాన్ని కవిత్వంగా చెప్పే పద్ధతేమైనా వస్తుందేమో తెలియదు. దాని గురుంచి ఇప్పుడు ఊహ చేయలేం.

హనుమాన్ ఒట్టి కవి మాత్రమే ఐతే నా ప్రాణం హాయిగా ఉండేది. అతను సైకాలజిస్టు, వివిధ భౌతికశాస్త్రాల గురించి మామూలు పాఠకులకు అందనంత పాండిత్యముంది. ఆ పాండిత్యం చాలా తరుచుగా ఈయన కవిత్వంలో దర్శనమిస్తూ మనల్ని ఆటలు పట్టిస్తుంది. నా మట్టుకు నాకు ఎన్నో శాస్త్ర విషయాలు చదివి తెలుసుకోవాలన్న అభిలాష ఉంది. నిజనికట్లా చదివి ఎన్నో విషయాల్ని గ్రహించాను. ఐతే నన్ను కూడా తికమక పెట్టిన శాస్త్ర "నానోలు" ఉన్నాయి.
"బిగ్ బ్యాంగ్
బిగ్ క్రంచ్

పునరపి

పునరపి-
"

నాకు బిగ్ బ్యాంగ్ థియరీ గూర్చి తెలుసు, బ్లాక్ హోల్స్ గూర్చి చదివాను. స్టీఫెన్ హాకింగ్ గూర్చీ, అతని పుస్తకాలు చదివాను. కాని బిగ్ క్రంచ్ అనేది నాకు తెలియదు. ఇక బిగ్ బ్యాంగ్ గూర్చే తెలియని వాల్లకి ఇది అస్సలు అందదు. ఇతని నానోల్లో విస్త్రుతి చాలా ఎక్కువే. సాధారణంగా కవితా రూపాలకు కొన్ని రకాల పరిమితులు నిర్ధిష్టంగాను, అనిర్ధిష్టంగానూ ఉంటయి. ఉదాహరణకి హైకూలకు అక్షర పరిమితే కాక, వస్తుపరమైన పరిమితీ ఉన్నది. అవి ప్రకృతికే పరిమితమైనవి. అట్లాగే ఋతువులు కూడా ఉండాలనే పరిమితి ఉంది. బహుశా; ఈ పరిమితులు కవిత్వాన్ని అర్ధం చేసుకోవడానికి లేదా భావించడానికి మార్గదర్షకాలుగా పనికొస్తాయి. క్లుప్తతే లక్ష్యంగా ఏర్పడ్డ ఈ నానోలకు ఇతర పరిముతుల్లేవు. కొన్ని చోట్ల సాధారణ విషయాలు చెప్పినపుడు ముఖ్యంగా ప్రకృతికి సంబందించిన విషయాలకొస్తే అదృష్టం కొద్దీ పాఠకుడికి అందుతాయి.

ఉదాహరనకి:

"శిశిరo
గాయానికి
వసంతం
ఆయింట్ మెంట్-
'


శిశిరం ఆకులు రాలే కాలమని అందరికి తెలిసిందే, వసంతంలో చెట్లు చిగురిస్తాయి. ఈ రెంటి సంబంధాన్ని చెప్తూ శిశిరాన్ని గాయంతోనూ, వసంతాన్ని ఆయింట్ మెంట్ తోనూ పోల్చడం మనకర్ధమౌతుంది/ అందుతుంది. అట్లాగే సాధారణ సామాజిక పరిస్థితుల గురించి చెప్తున్నపుడు ఎక్కువ శ్రమపడకుండానే చెప్పింది గ్రహించగలం:

"బావులు
ఇంకితే
బోర్లు
పొడుచుకొస్తై-"


నీళ్ళు పైనే ఉంటే బావులు తవ్వుతాం, బావుల్లో నీళ్ళు ఇంకిపోతే కొన్ని వందల అడుగులు లోతుల్లో వెళ్ళి బోర్లు వెయక తప్పదు. ఈ రెంటి సంబంధాన్ని పొడుచుకురావడమనే క్రియ వల్ల మనకర్ధమయ్యే కవిత్వముంది. ఈ రకంగా నేటి సమాజములో కనిపించే అనేక విషయాలను కవిత్వీకరించిన నానోలు ఇందులో ఛాలా ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల సెల్ ఫొన్ల వ్యాప్తి అందరికీ తెల్సిందే. ఈ మధ్య బజార్లొ చేపలు అమ్మేవాడు సెల్ ఫోన్ వాడడం చూసి ఆశ్చర్య పోయాను. పదహారేళ్ళ అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర్నుంచి, 70-80 ఏల్ల వృద్ధుల వరకు ఈ సెల్ ఫొన్లు వాడుతునే ఉన్నారు. దాన్ని నాజూగ్గా చెబుతూ..

"టెలీఫోన్
సెలవమ్మా
సెల్ ఫొన్
ముద్దుగుమ్మా-"


అంటూ ఒక నానో రాశారు. ఈ నానోలలో క్లుప్తత ప్రధాన లక్ష్యంగా ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తుంది. మనకు అనుభవం లోకి వచ్చే అనేక విషయాల గూర్చి ఈ నానోలు ప్రస్తావిస్తాయి. ఈ నానోల్లో వ్యంగ్యం కన్నా వాక్య వక్రత ప్రధాన కవితా మార్గంగా కనిపిస్తుంది.

ఈ వక్రతను ప్రాచీన అలంకారికుల్లో కుంతకుడు సూచిస్తాడు. తర్వాత, ఇతని నానోల్లో సాధారణంగా చాలా కవితా రూపాల్లో కనిపించే అంత్యప్రాసాది పద్ధతుల్ని గూడా వాడుకున్న ధోరణి కనిపిస్తుంది. చాలా నానోలు కొద్దిపాటి సమయం వెచ్చిస్తే అర్ధం కాకుండా పోవు. వీటిని అర్ధం చేసుకోవడానికి కావల్సింది కాస్త ఆలోచన, ఏకాగ్రత. ఇక ఆయనకు తెలిసిన సైన్సును నిక్షేపించిన నానోలు మన జ్ఞానాన్ని బట్టి మనకు అందవచ్చు, అందకపోవచ్చు, వాటికి మనము చేయగలిగింది ఏమీ లేదు. ఆఖరుగా ఒక మాట, ఈ నానోల్లో అక్కడక్కడ ఆయన రాజకీయ, సాంఘీక అబిప్రాయాలూ తొంగి చూస్తుంటాయి, అవి అందరికీ నచ్చకపోవచ్చు. నాకు నచ్చని కొన్ని అట్లంటి అభిప్రాయాలు కనిపించాయి, వాటిని పేర్కొని మీ కాలాన్ని వృధా చేయడం నాకిష్టం లేదు.

తెలుగులో నానోలు పేరుతో పొదుపే ప్రధాన లక్ష్యంగా మరో కవితా రూపాన్ని ప్రవేషపెట్టిందుకు హనుమాన్ ని మనసారా అభిందిస్తున్నా...

--చేరా, ది: 21-12-2005



8 comments:

  1. ఈగ హనుమాన్ గారు,
    మీరు ప్రచురించిన "నానోలు, కవిత్వం X 10-9" పుస్తకం బయట ఎక్కడా కనపడలేదు, కారణం చెప్పండి. వీలైతే అన్ని పత్రికలకు పంపి విస్తృత ప్రచారం కల్పించండి, చక్కటి ప్రిక్రియని పది కాలాల పాటు బ్రతికేట్లు దీవిద్దాం.

    ReplyDelete
  2. మిత్రమా! మీ కామెంటుకి ధన్యవాదాలు.
    కొన్ని అనివార్య కారణాల వల్ల, కొద్ది కాపీలే వెయడం వల్ల, అన్ని పత్రికలకు పంపలేక పోయా. త్వరలో మళ్ళీ అచ్చొత్తించి, పత్రికలకి పంపిస్తాను.
    మీ
    ఈగ హనుమాన్

    ReplyDelete
  3. చేరా గారు భలే రాసారు.

    కవితా ప్రక్రియని తిడుతున్నారో, పొగుడుతున్నారో తెలీకుండ చక్కగా వాతలు పెట్టారు.

    ReplyDelete
  4. మిత్రమా!!
    పరిహరించుకోవాల్సిన మన దోషాలు మనకు తెలియకపోవచ్చు, అటువంటప్పుడు పెద్దవాల్ల వాతలు దోష పరిహరణ చేస్తయి గదా!!
    అలాగ నిర్మాణాత్మకంగా చేరా గారి కామెంట్స్ నీ తీస్కోవడం జరిగిందని మీకు సవినయంగా తెలియచేస్తున్నాను.
    ఈగ హనుమాన్

    ReplyDelete
  5. డియర్ హనుమాన్ (హనీ) గారూ!

    మీ నానోలు చూశాను!

    మీ పరిచయ భాగ్యం కలగడం నా అదృష్టం!

    చేరా గారి ముందుమాట నచ్చింది!

    ఇక నానోలు--చా..................లా బాగున్నాయి.

    సందర్భానుసారం నా బ్లాగుల్లో వాటిని వాడుకోవడానికి మీకేమీ అభ్యంతరం లేదుగా?

    ధన్యవాదాలు!

    ReplyDelete
  6. సాహితీ మిత్రమా!!
    మీరు సందర్భానుసారంగా నానోలని ఉటంకించవచ్చు, ఉపయోగించుకోవచ్చు.
    ఆ నానోల కవి పేరు మరియు ఈ బ్లాగు రెఫెరెన్స్ ఇస్తే బావుంటుందేమోనని నా అభిప్రాయం.
    భవదీయుడు
    ఈగ హనుమాన్

    ReplyDelete